తోటి నటీమణులతో ఎఫైర్లపై స్పందించిన షారుఖ్
తన సహ నటీమణులతో ఎఫైర్లు ఉన్నాయంటూ చాలా కాలంగా వస్తున్న పుకార్లపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తొలిసారి స్పందించాడు. "గత 20 ఏళ్లుగా ప్రపంచంలోనే అందమైన నటీమణులతో నటిస్తున్నా. తోటి నటీమణులతో, విదేశీ యువతులతో నాకు ఎఫైర్లు ఉన్నాయంటూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, నా భార్య గౌరితో నాకున్న అనుబంధంపై అది ప్రభావం చూపలేదు. ఎందుకంటే, నాకు పని తప్ప మరో ఆలోచన ఉండదన్న విషయం గౌరికి తెలుసు కాబట్టి" అని షారుఖ్ వివరించాడు.
ఎన్నో ఏళ్లు కలిసున్న తర్వాత భార్యాభర్తలు తోబుట్టువుల్లా మారిపోతారనే విషయం గురించి షారుఖ్ ని ప్రశ్నిస్తే... అలా తాను భావించడం లేదని, తన భార్య తనకు సోదరి తప్ప ఏదైనా అవుతుందని సమాధానమిచ్చాడు. వర్క్ బిజీలో గౌరితో ఎక్కువగా గడపలేకపోయానని... దాంతో, తమ మధ్య బంధం ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పాడు. సినిమాల గురించి కాని, జీవితం గురించి కాని తామిద్దరం ఒకేలా ఆలోచించలేదని... కానీ, పిల్లల విషయంలో మాత్రం తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపాడు.